Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వేతనాల పెంపులో పారదర్శకత ఏది?

వేతనాల పెంపులో పారదర్శకత ఏది?

పెరిగిన ధరలకు అనుగుణంగా పెంపు లేదు: సీఐటీయూ రాష్ట్ర కమిటీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదనీ, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసవేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష‍, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 14 ఏండ్ల తర్వాత రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించడం ఆహ్వానించదగ్గ విషయమేనని తెలిపారు. వచ్చే నెల 2 నుంచి ఈ సవరించిన వేతనాలు అమలు చేస్తామని, కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని వారు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ప్రకటించిన వేతనాలు పెరిగిన ధరలకు అణుగుణంగా లేవని విమర్శిం చారు. కార్మికులు, కార్మిక సంఘాలు చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగించిందని పేర్కొన్నారు. వేతనాల పెంపుదల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని, దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా శాస్త్రీయ పద్ధతిలో కనీసవేతనాల పెంపుదల చేస్తామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ఆచరణలో చిత్తశుద్ధి లోపించిందని తెలిపారు. అ శాస్త్రీయమైన పద్ధతిలో వేతనాలను ప్రకటించారని పేర్కొన్నారు.

కనీస వేతనాలను రాష్ట్రంలో 3 జోన్లుగా విభజించారనీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, గ్రామీణ ప్రాంతాలుగా విభజించి వేతనాలు వేర్వేరుగా ప్రకటించడం తగదని పేర్కొన్నారు. వేతనాలను 4 క్యాటగిరీలుగా విభజించి అన్ని రంగాల్లో ఒకే రీతిలో పెంచడం వల్ల గతంలో ఎంప్లాయిమెంట్లో వివిధ రకాల పనులకు ఆయా రకాలుగా ఉన్న పద్ధతి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల నష్టం జరుగుతుందని తెలిపారు. కనీస వేతనాల పెంపుదల సందర్భంగా కరువుభత్యం గురించి ప్రస్తావించకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. పెరిగిన వేతనాలు కూడా 4 క్యాటగిరీల్లో అన్స్కిల్డ్ వర్కర్లకు రూ.16 వేలు, సెమిస్కిల్డ్ వర్కర్లకు రూ.17వేలు , స్కిల్డ్ వర్కర్లకు రూ.18,500, హైస్కిల్డ్ వర్కర్లకు రూ.20వేలు పెంచినట్టు సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ఇందులో ఒక్క అన్స్కిల్డ్ వర్కర్లకు తప్ప మిగితా వారికి బేసిక్ కరువుభత్యం కలుపుకుని ఇప్పటికే వస్తున్న జీతానికి, పెరిగిన దానికి పెద్ద తేడా ఏమీ లేదని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తగ్గే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంట్రాక్టు లేబర్ జీవో నెం 11 ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో కార్మికులు రూ.13,098 నుంచి రూ. 23,683 వరకు వేతనాలు పొందుతున్నారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం పెంచింది పెద్దగా ఏమి లేదని విమర్శించారు. జీవో 4లో స్కిల్డ్ కార్మికుడికి వేతనం రూ.19,572 ఉండగా సీఎం ప్రకటించిన వేతనం రూ.18,500లు మాత్రమేనని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే రూ. 1072 తగ్గిందని తెలిపారు. దీంతో పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కనీస వేతనాల సలహామండలి బోర్డు అన్ స్కిల్డ్ కార్మికుడికి కనీస వేతనం రూ.18,009, కరువుభత్యాన్ని ఒక్కొక్క పాయింట్కు రూ.12గా సిఫారసులు చేశారని గుర్తు చేశారు. దీంతో పాటు 2021 జూన్ 25న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5 జీవోలను జారీ చేసిందని తెలిపారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనుసరించాల్సిన ఏ ప్రామాణికాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. కార్మిక సంఘాలు, కనీస వేతనాల సలహామండలి సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా మంత్రివర్గ ఉపసంఘం పేరిట కనీస వేతనాలు ప్రకటించటమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలు, 1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ ఆక్ర్టాయి ఫార్ములా, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వేతనాలు పెంచలేదని తెలిపారు. శాస్త్రీయంగా లెక్కిస్తే రూ.32వేలు వస్తుందనీ. అయినప్పటికీ కార్మిక సంఘాలు కనీస వేతనం రూ.26 వేలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన కనీస వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana