Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వికలాంగుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

వికలాంగుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

ప్రభుత్వ పథకాల్లో 
5 శాతం రిజర్వేషన్లు అమలు : టీవీసీసీ చైర్మెన్ ముత్తినేని వీరయ్య ఎన్పీఆర్డీ రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-మలక్పేట్

వికలాంగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని టీవీసీసీ చైర్మెన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వికలాంగుల కోసం 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ''వికలాంగుల చట్టాలు-సంక్షేమ పథకాలు'' రాష్ట్ర సదస్సు పోస్టర్ను బుధవారం హైదరాబాద్ మలక్పేటలోని వికలాంగుల కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం చైర్మెన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని తెలిపారు. తొలిసారిగా పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించినట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 40 శాతం వైకల్యం ఉన్న వారికి సహాయ పరికరాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వికలాంగుల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 వేల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ''బాల భరోసా'' కార్యక్రమం కింద పుట్టిన ప్రతి చిన్నారికీ అంగవైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చట్టాలను వికలాంగులు సద్వినియోగించుకోవాలని సూచించారు.
ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల సాధనతోపాటు చట్టాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర సదస్సులో 2017 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, నేషనల్ ట్రస్ట్, ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. వికలాంగుల పెన్షన్ను రూ.6 వేలకు పెంచడం, విద్య, ఉపాధి, సామాజిక భద్రత అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్టు చెప్పారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టీవీసీసీ చైర్మెన్ ముత్తినేని వీరయ్య, ఎన్పీఆర్డీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నంభురాజన్, ఐద్వా రాష్ట్ర నాయకులు టి.జ్యోతి హాజరుకానున్నట్టు తెలిపారు. సదస్సుకు 33 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని, వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, కోశాధికారి ఆర్.వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శశికళ, హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షులు రాజు, జిల్లా ఉపాధ్యక్షులు గౌడ్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana