Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వ్యాక్సిన్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయండి

వ్యాక్సిన్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయండి

- ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
దేశంలో వ్యాక్సిన్‌వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ప్రజలందరికీ ఉచితంగా టీకా అం దించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విరుచుకుపడి ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నదని గురువారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కరోజే మూడు లక్షలకుపైగా కేసులు నమోదు కావడమనేది దేశం ప్రమాదపుటంచులో ఉన్నదనే సంకేతాన్ని చూపుతున్నదని తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కరోనా మూడో దశలో ఉందని వైద్య నిపుణులు ప్రకటించారని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాక్సిన్‌ ధరను మూడు రకాలుగా నిర్ణయించి వ్యాపారానికి పూనుకుంటున్నదని విమర్శించారు. ఈ వ్యాపారాన్ని తీవ్రంగా ఖండించారు. వ్యాక్సిన్‌ ధర మొత్తాన్ని కేంద్రమే భరించి ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయాలని డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌, బెడ్లతోపాటు, రెమ్‌డెసివిర్‌ కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.

ఒకవైపు కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంటే కేంద్రం మీనమేషాలు లెక్కపెడుతూ, రాష్ట్రాల మీద భారాలు వేయాలని ప్రయత్నిస్తున్నదని తెలిపారు. వ్యాక్సిన్‌ ధర కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రయివేటు ఆస్పత్రులకు రూ.600లుగా ప్రకటించి వ్యాపారానికి పూనుకోవడం సరైంది కాదని వివరించారు. ఇది ప్రజల ప్రాణాలతో చెలాగాటమాడడమేనని పేర్కొన్నారు. ఒకేదేశం, ఒకే చట్టమని ఊదరగొట్టే మోడీ ప్రభుత్వం ఒకే దేశం, ఒకే వ్యాక్సిన్‌, ఒకే ధర అని చెప్పకపోవడం శోచనీయమని విమర్శించారు. ఈ దుర్భర పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ ధర మొత్తాన్ని కేంద్రమే భరించాలనీ, దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయాలని డిమాండ్‌ చేశారు. నిల్వ ఉన్న పీఎంకేర్స్‌ నిధులు ఈ విపత్తు సమయంలో ఖర్చు చేయాలనీ, దీనికోసం రాష్ట్రాలన్నీ కేంద్రంపై పోరాడాలని విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana