Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యుద్ధంపై విభేదాలు

యుద్ధంపై విభేదాలు

పోరు సాగించాల్సిందే : నెతన్యాహూ దౌత్య పరిష్కారమే మేలు : ట్రంప్

వాషింగ్టన్ : ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య తీవ్ర అభిప్రాయబేధాలు తలెత్తాయి.

వీరిద్దరి మధ్య గంట పాటు జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా అవి బయటపడ్డాయి. ఇరాన్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై నెతన్యాహూ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇరాన్పై తిరిగి దాడులు ప్రారంభించే విషయంపై ఇరువురు నేతల మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ నిర్ణయాన్ని విన్న నెతన్యాహూ హతాశుడయ్యారు. మీడియా కథనాల ప్రకారం…ఇరాన్పై తిరిగి దాడులు ప్రారంభించాలని నెతన్యాహూ పట్టుపట్టారు. అయితే ట్రంప్ మాత్రం అందుకు అంగీకరించలేదు. యుద్ధం కంటే దౌత్యపరమైన పరిష్కారం సాధిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిని నెతన్యాహూ వ్యతిరేకించారు. చర్చల ద్వారా పరిష్కారం సాధ్యపడదని చెప్పారు. ఇరాన్ సైనిక సామర్ధ్యాన్ని మరింతగా దెబ్బ తీయాలంటే దాడులు చేయక తప్పదని అన్నారు. ఇరాన్లోని మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేసి, అక్కడి ప్రభుత్వాన్ని బలహీనపరచాలని సూచించారు. అయితే ట్రంప్ మాత్రం శాంతి చర్చలకే మొగ్గు చూపారు. ముందుగా దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలని, అప్పటికీ ఫలితం లేకుంటే దాడులకు తానూ సిద్ధమేనని చెప్పారు.

ఇరాన్తో అవగాహనకు వచ్చేందుకు ఖతార్, పాకిస్తాన్ కృషి చేస్తున్నాయని తెలిపారు. యుద్ధానికి విరామం ప్రకటించినందున ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధిపై కూలంకషంగా చర్చించేందుకు సమయం చిక్కుతుందని అన్నారు. అయితే ట్రంప్ వ్యూహంపై నెతన్యాహూ పెదవి విరిచారు. దీనితో ఫలితం ఏమీ ఉండదని చెప్పారు. ఇరాన్పై దాడులను వాయిదా వేయడం పెద్ద తప్పిదం అవుతుందని హెచ్చరించారు. ట్రంప్తో ఫోన్ సంభాషణ తర్వాత నెతన్యాహూ పూర్తి అసంతృప్తికి గురయ్యారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఆయన పడిపోయారట. ఇదిలావుండగా ఇరాన్పై తిరిగి పోరు ప్రారంభించే విషయంపై ట్రంప్తో మరోసారి చర్చించేందుకు నెతన్యాహూ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లవచ్చునని తెలుస్తోంది. ఫోన్కాల్ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ నెతన్యాహూతో తనకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను ఏది చెబితే నెతన్యాహూ ఆ పని చేస్తారని కూడా అన్నారు. కాగా ఇజ్రాయిల్ అధికారులు కూడా ఇరాన్పై సైనిక చర్యకే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

పాక్ ద్వారా సందేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాం : ఇరాన్
పాకిస్తాన్ ద్వారా టెహ్రాన్, వాషింగ్టన్ సందేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై తెలిపారు. ఇరాన్ పంపిన 14 సూత్రాల ఆధారంగా అనేక సందర్భాలలో సందేశాలను మార్పిడి చేసుకుంటున్నామని, అమెరికా అభిప్రాయాలు తమకు అందాయని, వాటిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇదిలావుండగా అమెరికా`ఇరాన్ మధ్య జరుపుతున్న మధ్యవర్తిత్వంలో భాగంగా పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి అశిం మునీర్ గురువారం టెహ్రాన్ వెళ్లారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana