Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మోడీ సర్కార్

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మోడీ సర్కార్

దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేయాలి ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్ష‍ులు రోషన్ కుమార్ సిన్హా
యాదగిరి గుట్టలో సెప్టెంబర్ 8,9 తేదీల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభ : 
వలి ఉల్లా ఖాద్రి, ధర్మేంద్ర

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని మోడీ సర్కారు పరీక్ష‍ా పత్రాల లీకేజీతో యువత భవిష్యత్ను నాశనం చేస్తున్నదని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్ష‍ులు రోషన్ కుమార్ సిన్హా విమర్శించారు. బుధవారం హిమాయత్నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను మోడీ సర్కార్ మోసం చేసిందన్నారు. పదేండ్ల బీజేపీ పాలన ఫలితంగా దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఖాళీలు భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను ఎత్తిచూపారు. విద్యా ప్రయివేటీకరణ వల్ల అందరికీ ఒకేస్థాయి విద్య అందట్లేదనీ, ఇది అంతరాలను పెంచిపోషిస్తున్నదని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని వాపోయారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం, విద్యా-ఉపాధి సమస్యల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాల పట్ల యువత ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఉద్యోగ హక్కు, విద్య హక్కు, సామాజిక న్యాయం, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. ​ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభలను యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. రైల్వేలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని కోరారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు వెంకటేశ్వర్లు, లింగం రవి, టి. సత్య ప్రసాద్, పి. మహేందర్, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana