ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి లో పర్యటించి, కొండవీటివాగు, పాలవాగు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో వరద ముప్పును నివారించేందుకు జరుగుతున్న ముందస్తు చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు.మంత్రి నారాయణ పర్యటనకు
కొండవీటివాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిల కింద నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పేరుకుపోయిన మట్టి, పూడికను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
కొండవీటివాగు ప్రవాహ సామర్థ్యం పెంచడానికి, వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాగును మరింత వెడల్పు చేయాలని సూచించారు.
ప్రస్తుతం పాలవాగుపై 30, కొండవీటివాగుపై 39 కలిపి మొత్తం 69 బ్రిడ్జిల వద్ద వరద నీరు సాఫీగా సాగిపోయేలా పనులు జరుగుతున్నాయి.
నీరుకొండ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను మంత్రి పరిశీలించారు. రాజధాని పరిధిలో నీరుకొండ, పెనుమాక, శాఖమూరు రిజర్వాయర్లు 0.54 టిఎంసిల నీటిని నిల్వ చేసేలా రూపొందుతున్నాయి.
అమరావతిలో వరద మేనేజ్‌మెంట్ వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలతో, డచ్ నిపుణుల సూచనల ఆధారంగా డిజైన్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గత 200 సంవత్సరాల వర్షపాతం, వరదల చరిత్రను విశ్లేషించి ఈ ప్రణాళికను సిద్ధం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో సెకనుకు 24,000 క్యూసెక్కుల నీటిని బయటకు పంపేలా పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
అమరావతి రాజధానికి సంబంధించిన తొలి దశ మౌలిక వసతుల పనులను (రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ప్రభుత్వ భవనాలు) ఆగస్టు 2028 నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
అమరావతి అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఆయన ఈ సందర్భంగా తిప్పికొట్టారు.
భారీ వర్షాలు వస్తే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది – రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసానికి వైసీపీ కుట్ర చేస్తుంది అన్నారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు.
రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తే తెలుస్తుంది – రైతుల భూములను వెనక్కి తిరిగి ఎలా ఇచ్చేస్తారు? భవనాలు, రోడ్లు, పైపులైన్ల నిర్మాణం పూర్తయ్యాక భూములివ్వడం సాధ్యమా? మాజీ సీఎంగా చేసిన వ్యక్తి అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారు? అని మంత్రి నారాయణ అన్నారు.

