ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులు మారకపోతే, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల నిత్యావసరాలు, ఇంధన ధరలు పెరిగి పేద దేశాలపై భారం పడుతోంది అందుకే ఇండియా, నెదర్లాండ్స్ ఫ్యూచర్ రెడీ సప్లై చైన్‌లను ఏర్పాటు చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు.
సంపన్న దేశాల నిర్ణయాలు, సరఫరా గొలుసుల అంతరాయాలు పేదరిక నిర్మూలన లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి.
ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని, వసుధైక కుటుంబకం భావనతో పరస్పరం సహకరించుకోవాలని పీఎం మోదీ కోరారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి, యుద్ధాలు, ఇంధన కొరత వంటి వరుస సంక్షోభాల వల్ల ప్రస్తుతం ఒక ‘విపత్తుల దశాబ్దం’ నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతరాయం లేని, నమ్మకమైన సరఫరా వ్యవస్థల అవసరం ఎంతైనా ఉందని పీఎం మోదీ స్పష్టం చేశారు.
భారత్, నెదర్లాండ్స్ కలిసి అత్యంత పారదర్శకమైన, విశ్వసనీయమైన మరియు ‘ఫ్యూచర్ రెడీ (భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే) సప్లై చైన్’ లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాయి.
ఇరు దేశాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా గ్రీన్ హైడ్రోజన్, సెమికండక్టర్లు, సాంకేతిక ఆవిష్కరణలు, నీరు మరియు ఇంధన భద్రత వంటి వ్యూహాత్మక రంగాలలో కలిసి పనిచేస్తున్నాయి.
భారత్ – యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం వల్ల భారతీయ వ్యాపారాలకు నెదర్లాండ్స్ ఒక సహజ ప్రవేశ ద్వారం (Gateway to Europe) గా మారనుందని ఆయన పేర్కొన్నారు.
నెదర్లాండ్స్‌లో ఉంటున్న భారతీయ సమాజం యూరప్ ప్రమాణాలను, భారత్ ఆశయాలను చక్కగా అర్థం చేసుకోగలదని, ఇరు దేశాల బంధానికి వారు ఒక బలమైన వారధిగా నిలుస్తారని పీఎం మోదీ కొనియాడారు.

