తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు బహిరంగ సభల్లో కూడా పాల్గొననున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం అధికారికంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.
దీని కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఆదిమ తెగలకు అండగా: జూన్ 1న ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి ఆదిమ తెగలకు మద్దతుగా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించనున్నారు.
జూన్ 3న రంగారెడ్డి జిల్లా కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కోహెడలో 239 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్‌ను నిర్మించనుంది.
ఆ తర్వాత అదే రోజు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తారు. రాత్రికి సోమశిలలో బస చేయనున్నారు.
జూన్ 4న జూరాల, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. నార్లాపూర్, వట్టేం, ఏదుల రిజర్వాయర్లను సందర్శించి పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు.
జూన్ 5న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళా సంఘాలకు బస్సులను రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. రూ.199 కోట్లతో కొనుగోలు చేసిన 553 బస్సులను మహిళలకు అందించనున్నారు.
కాగా, మహిళా సంఘాలకు బస్సులు అందించి, వాటిని తెలంగాణ ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది.
క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

