అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో సంచలనం సృష్టించిన పాస్టర్, 'భరోసా' పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ధార అభినయ్ దర్శన్ పై జరిగిన దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలిందని పోలీసుల విచారణలో బట్టబయలైంది.
ప్రజల్లో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో “సింపతీ” పొందడం కోసం ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించి ఈ నాటకానికి తెరలేపారని పోలీసులు ఆధారాలతో సహా వెల్లడించారు.
మే 18న చింతపల్లి మండలం నీరుతోటపాలెం అటవీ ప్రాంతంలో తన కారుపై కొందరు ముసుగులు ధరించిన దుండగులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసి, తనను కత్తులతో నరికి చంపేందుకు ప్రయత్నించారని అభినయ్ దర్శన్ ఆరోపించారు.
గతంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే నన్ను కూడా చంపాలని చూస్తున్నారని, దీని వెనుక స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుల రాజకీయ కుట్ర ఉందని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేశారు.
లీకైన ఆడియో టేప్: దాడి జరగడానికి ముందే, ఈ నాటకాన్ని ఎలా రక్తి కట్టించాలో తన అనుచరులతో అభినయ్ దర్శన్ మాట్లాడిన ఆడియో సంభాషణలు (ఆడియో లీక్) పోలీసుల చేతికి చిక్కాయి.
రాజకీయంగా ఎదగడానికి, ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడానికి తన అనుచరులతోనే కారు అద్దాలు పగలగొట్టించుకుని, ఒంటిపై బ్లేడ్లతో గాయాలు చేయించుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
దాడి జరుగుతున్న సమయంలో చాలా పక్కాగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం కూడా ముందస్తు ప్రణాళికలో భాగమేనని తేలింది.
ఈ దాడి ఘటన అంతా అభినయ్ దర్శన్ ఆడిన ఫేక్ డ్రామా అని తేల్చిన పోలీసులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటి ఆరోపణలపై పాస్టర్ అభినయ్ దర్శన్‌తో పాటు ఈ డ్రామాలో సహకరించిన ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.

