
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీలో ఎన్డీయే ఎంపీలతో కలిసి ఆయన ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానికి శాలువా కప్పి, ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026 బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలోనూ ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందే అవకాశం ఉంది.
ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకే లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. 2014 నాటి పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5ను సవరిస్తూ ‘కొత్త రాజధాని’ అనే పదం స్థానంలో ‘అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది.
తన పర్యటనలో భాగంగా లోకేశ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను కూడా కలవనున్నారు.

