ప్రఖ్యాత ఇంజినీర్, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కె.ఎల్.రావు (కానూరి లక్ష్మణరావు) వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీలు నరసింహమూర్తి, వరప్రసాద్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశ ఇరిగేషన్ రంగంలో డాక్టర్ కె.ఎల్.రావు అందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి కొనియాడారు.
హిరాకుడ్, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన పోషించిన ప్రధాన పాత్రను గుర్తుచేసుకున్నారు.
దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన విజనరీ కె.ఎల్.రావు అని, నాటి వాజ్‌పేయీ నుండి నేటి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు వరకు ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు గోదావరి జలాలు తరలించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

