రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ మహిళా మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ ఇద్దరూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు ఆత్మీయంగా రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ పరకాల నియోజకవర్గ టికెట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కొన్ని విమర్శల వల్ల వారి మధ్య కొంత దూరం పెరిగినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో టిపిసిసి క్రమశిక్షణా కమిటీ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వివాదం తర్వాత కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇదే మొదటిసారి.
పండుగను పురస్కరించుకుని ఆమె సీఎం అపాయింట్‌మెంట్ కోరగా, రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
సీఎం నివాసానికి వెళ్లిన కొండా సురేఖ ఆయనకు రాఖీ కట్టడంతో ఇరు నేతల మధ్య ఉన్న విభేదాలు తొలిగిపోయి మళ్లీ సఖ్యత కుదిరినట్లయింది.
ప్రతి ఏటా లాగే ఈసారి కూడా మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి తన తోబుట్టువుల అనుబంధాన్ని చాటుకున్నారు.

