ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 టేకోవర్ వ్యవహారంలో తెరవెనుక భారీ ఎత్తున అవకతవకలు, అవినీతి జరిగాయని రఘునందన్ రావు సంచలన ఆరోపణ చేశారు.
వీటిపై ఎక్కడ విచారణ జరిగి తనపై కేసులు ఫైల్ అవుతాయో అనే భయంతోనే . సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేంద్రంపై అభాండాలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మెట్రో ఫేజ్-2 పనులను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఎంపీ పూర్తిగా కొట్టేశారు. “రాష్ట్రానికి ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నుంచి వచ్చిన భారీ రుణం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ వల్లే సాధ్యమైంది.
కేంద్రమే అంతగా సపోర్ట్ చేస్తున్నప్పుడు, మెట్రో ఫేజ్-2 పనులను మోదీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది?” అని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
సొంత క్యాబినెట్ మంత్రులే ముఖ్యమంత్రి మాటలను అస్సలు ఖాతరు చేయడం లేదని, అందుకే రేవంత్ రెడ్డి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోయి కేంద్రంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

