సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కు గత బీఆర్‌ఎస్ హయాంలో సుమారు ₹30,000 కోట్ల బకాయిలు పడ్డాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భాగస్వామ్యమేనని విమర్శించారు.
సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ విద్యుత్ సంస్థల (డిస్కాంలు, జెన్‌కో) నుండి మొత్తం ₹54,148 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.
కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుమారు ₹30,000 కోట్ల బకాయిలను పేరుకుపోయేలా చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ₹24,000 కోట్ల బకాయిలను అదనంగా పెంచిందని మండిపడ్డారు.
2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి సింగరేణి ఖాతాల్లో ₹3,500 కోట్ల బ్యాంకు డిపాజిట్లు ఉండేవని, కానీ కేసీఆర్ కుటుంబం మరియు బీఆర్‌ఎస్ నాయకుల మితిమీరిన జోక్యం, అనాలోచిత నిర్ణయాల వల్ల సంస్థ అప్పులపాలైందని ఆరోపించారు.
కిషన్ రెడ్డి సవాల్సింగరేణి సంస్థకు ఎవరి హయాంలో ఎంత నష్టం వాటిల్లిందనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన బీఆర్‌ఎస్ పార్టీకి సవాల్ విసిరారు.
సింగరేణి కార్మికుల కష్టాన్ని కమిషన్ల రూపంలో దోచుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయాలను పక్కనబెట్టి ఈ బకాయిలను విడుదల చేసి సింగరేణిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

