తెలంగాణలో 22-A నిషేధిత భూముల జాబితాకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలను ఉధృతం చేసింది.
22-A నిబంధనల కింద చేర్చిన ప్రైవేటు, రైతుల భూములను వెంటనే తొలగించి విముక్తి కల్పించకపోతే, రాబోయే శాసనసభ (అసెంబ్లీ) సమావేశాలను నడవనివ్వబోమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.
రాంచందర్‌రావు హెచ్చరించారు.
సిద్దిపేటలో నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
22-A భూముల సమస్యను అసెంబ్లీ సమావేశాల లోపు పరిష్కరించకపోతే సభను స్తంభింపజేస్తామని, వేలాది మంది బాధితులతో అసెంబ్లీని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘ధరణి’తో సమస్యలు సృష్టిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూభారతి’ పేరుతో అంతకంటే ఘోరంగా ప్రజలను, రైతులను గందరగోళానికి గురిచేస్తోందని ఆరోపించారు.
పట్టా భూములను నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితాలోకి ఎలా చేర్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఆంక్షల వల్ల రైతులు తమ భూములను అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు డబ్బు సర్దుబాటు చేసుకోలేక తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ భూముల సమస్యపై బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించిన తెలంగాణ బీజేపీ, ఇందులో భాగంగానే సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ దీక్షలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
