తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్, ఆయన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) ఘన విజయంపై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పార్టీ పెట్టిన రెండేళ్లకే ద్రవిడ దిగ్గజాలను పక్కకు నెట్టి విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి చేరువ కావడం తాను ఊహించలేదని అన్నారు.
జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ “నిజాయితీగా చెప్పాలంటే ఇది ఎవరూ ఊహించని ఫలితం. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి ఎందరో సినీ నటులకు దక్కని రాజకీయ విజయం విజయ్‌కు దక్కింది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన మరింత లోతుగా విశ్లేషించారు. “ప్రజలు, ముఖ్యంగా జన్‌జీ తరం యువత, తక్షణమే అద్భుతాలు జరగాలని ఆశిస్తున్నారు. ‘ఒకే ఒక్కడు’ సినిమాలో అర్జున్ ఒక్కరోజులో అన్నీ మార్చేసినట్టు, క్షణాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు.
ఈ ఆలోచనా విధానం చాలా ప్రమాదకరం. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, దానికి సమయం పడుతుంది. మార్పును కోరుకోవడంలో తప్పు లేదు, కానీ అది తక్షణమే జరగాలనుకోవడం దేశానికి మంచిది కాదు” అని హెచ్చరించారు.
“ప్రజలు మూడో కంటికి తెలియకుండా చాలా సైలెంట్‌గా విజయ్ వైపు మళ్లారు. ప్రజల తీర్పును మనం విశ్లేషించలేం.
ఎలాంటి బలమైన సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా, కేవలం తన నటనతో జనాన్ని మెప్పించిన ఒక కొత్త ముఖం, ఇలా అనుహ్యంగా గెలవడం నిజంగా దిగ్భ్రాంతికరం.
ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పరిణామంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి, లేదంటే దేశం ప్రమాదంలో పడుతుంది” అని జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు.

