హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు దసరా పండుగ సెలవులను విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ సహా అన్ని రకాల మేనేజ్‌మెంట్ల పరిధిలోని విద్యాసంస్థలకు ఈ షెడ్యూల్ వర్తించనుంది.
పాఠశాలల్లో ప్రస్తుతం జరుగుతున్న సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలు అక్టోబర్ 9వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు (అక్టోబర్ 10) నుంచే విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభమవుతాయి. పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు కొనసాగుతాయి. పండుగ సెలవుల అనంతరం తిరిగి అక్టోబర్ 23న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
మరోవైపు ఇంటర్మీడియట్ విద్యామండలి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు 12 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్ 22న కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రకటించిన హాలిడేస్ షెడ్యూల్‌ను విద్యాసంస్థలన్నీ విధిగా పాటించాలని, దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా, పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

