Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
25 ఏళ్ల సర్వీస్ ఉన్నోళ్లను పరీక్ష రాయమనడం ఏంటి?..చంద్రబాబుపై జగన్ ఫైర్!

25 ఏళ్ల సర్వీస్ ఉన్నోళ్లను పరీక్ష రాయమనడం ఏంటి?..చంద్రబాబుపై జగన్ ఫైర్!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధనలతో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. 2011 కంటే ముందు నుంచి టీచర్లుగా సేవలు అందిస్తున్న వారికి కూడా టెట్ పరీక్ష తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో దాదాపు లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని ఆయన ధ్వజమెత్తారు.

గత 20 నుంచి 25 ఏళ్లకు పైబడి నిర్దిష్ట సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న సీనియర్లను, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్‌తో కూడిన టెట్ పరీక్ష రాయమనడం, అందులోనూ కనీసం 60 శాతం మార్కులు సాధించాలని నిబంధన పెట్టడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు. వీరంతా అప్పట్లో కఠినమైన డీఎస్సీ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాకే ఉద్యోగాలు సాధించారని ఆయన గుర్తుచేశారు. వారు విధుల్లో చేరే నాటికి 'టెట్' అనే పరీక్షే ఉనికిలో లేనప్పుడు, ఇప్పుడు దాన్ని బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్ తప్పనిసరి అయినప్పటికీ, ఆ చట్టం రాకముందు నుంచే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల వాదనలో పూర్తి న్యాయం ఉందని ఆయన మద్దతు పలికారు.

ఈ అనాలోచిత టెట్ నిబంధన కారణంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు నిలిచిపోవడమే కాకుండా, చివరకు ఉద్యోగ భద్రత కూడా లోపించి తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ లోకం ఇంతలా ఇబ్బంది పడుతున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని, కనీసం చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్న ఆలోచన కూడా ఆయనకు లేకపోవడం దారుణమన్నారు. 2011కు ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, ఉపాధ్యాయులకు తక్షణ ఉపశమనం కలిగించాలని జగన్ డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu