గోదావరి, కృష్ణా నదుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ మోటార్లు నడపకుండా పంటలను ఎండబెట్టడం క్రిమినల్ నెగ్లిజెన్సీ (నేరపూరిత నిర్లక్ష్యం) కిందకే వస్తుందని BRS సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, రైతాంగాన్ని ఆదుకోవడంలో చేతగాని ఈ పాలకులకు ఉరి వేసినా తప్పులేదని ఆయన ధ్వజమెత్తారు. దేవాదుల ప్రాజెక్టు మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి గురుదక్షిణగా, తెలంగాణ వాడుకోవాల్సిన కృష్ణా, గోదావరి జలాలను రేవంత్ రెడ్డి ఏపీకి ధారాదత్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నట్లు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని హరీశ్‌రావు సవాల్ విసిరారు. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కట్టడానికి మహారాష్ట్ర అంగీకరిస్తూ చేసుకున్న ఒప్పంద పత్రాలు ఏవైనా ఉంటే ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలన్నారు. గతంలో తాము కూడా తుమ్మిడిహెట్టి వద్ద సర్వే చేయించామని, కానీ అక్కడ కేవలం 20 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉండటం, ముంపు సమస్య ఎక్కువగా ఉండటం వల్లే మేడిగడ్డ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టొద్దని నిపుణుల కమిటీలు ఎక్కడా చెప్పలేదని, కేవలం మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీళ్లను తరలించడం సాధ్యం కాదని మాత్రమే నివేదికల్లో పేర్కొన్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై కక్షసాధింపు చర్యలు మానుకొని, తక్షణమే పంపింగ్ ప్రారంభించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వానికి నీళ్లివ్వడం చేతకాకపోతే, కేవలం మూడు నెలల పాటు సాగునీటి శాఖ బాధ్యతలను తనకు అప్పగించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆ మూడు నెలల్లోనే మోటార్లను ఎలా నడపాలో, ఎండిపోతున్న తెలంగాణ పొలాలకు నీళ్లు ఎలా ఇవ్వాలో తాను చేతల్లో చూపిస్తానని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

