టాలీవుడ్ ప్రముఖ దర్శక దిగ్గజం ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన అత్యంత బోల్డ్ అండ్ రియలిస్టిక్ మూవీ 'ఆరుగురు పతివ్రతలు' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుమారు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, కాలక్రమేణా సోషల్ మీడియాలో కల్ట్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ఇంటర్నెట్ యుగంలోనూ ఈ సినిమాలోని డైలాగులు, సన్నివేశాలు మీమ్స్ రూపంలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ క్లాసిక్ చిత్రాన్ని సరికొత్త హంగులతో 4K వెర్షన్‌లో అక్టోబరు 29న (గురువారం) భారీస్థాయిలో రీ-రిలీజ్ చేయనున్నారు.
భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాలు, వివాహేతర సంబంధాలు, లైంగిక సమస్యలు, క్షణికావేశాలు, బలవంతపు పెళ్లిళ్లు, శాడిస్టు భర్తల మనస్తత్వాలు వంటి సున్నితమైన అంశాలను ఈవీవీ బాహాటంగా తెరపై ఆవిష్కరించారు. ఆ కాలంలోనే సమాజంలోని విభిన్న కోణాలను ధైర్యంగా చర్చించిన చిత్రంగా ఇది నిలిచింది. అమృత, లహరి, చలపతి రావు, ఎల్బీ శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషించి తమ నటనతో మెప్పించారు.
కథాంశం విషయానికొస్తే.. పదో తరగతిలో కలిసి చదువుకున్న ఆరుగురు స్నేహితురాళ్లు చాలా కాలం తర్వాత అనుకోకుండా కలుసుకుంటారు. ఆ కలయికలో తమ వైవాహిక జీవితాలు, భర్తల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టసుఖాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. చివరకు తమ స్నేహితురాలిని ఒక శాడిస్ట్ భర్త బారి నుంచి ఎలా కాపాడుకున్నారు అనేదే ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం. మహిళల కోణంలో వివాహ వ్యవస్థ, బంధాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయనే కోణంలో దర్శకుడు ఈ చిత్రాన్ని అత్యంత వాస్తవికంగా మలిచారు.

