ముంబై: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మళ్లీ పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన చిరకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారు.
జూలై 5న ముంబైలోని అమీర్ ఖాన్ నివాసంలో అత్యంత వైభవంగా, ప్రైవేట్ వేడుకగా ఈ పెళ్లి జరగనుంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ ద్వారా వీరిద్దరూ ఒకటవుతారని నటుడికి అత్యంత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
సన్నిహితుల సమక్షంలోనే వేడుక
ప్రస్తుతం 61 ఏళ్ల వయసున్న అమీర్ ఖాన్, 47 ఏళ్ల గౌరీ స్ప్రాట్ గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తమ బంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లాలని ఇరుపక్షాల కుటుంబాల మద్దతుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా ఈ వేడుకను ముగించాలనుకుంటున్నారని సమాచారం. ఈ పెళ్లికి బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు హాజరయ్యే అవకాశం ఉందని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.
ఎవరీ గౌరీ స్ప్రాట్?
గౌరీ స్ప్రాట్ గతంలో 'అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్' సంస్థతో కలిసి పనిచేశారు. ఆమెకు గత వివాహం ద్వారా 'క్విన్' అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. గౌరీ స్ప్రాట్‌కు ఒక విశిష్టమైన కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె బ్రిటన్‌లో జన్మించి, 1920ల కాలంలో భారతదేశానికి వచ్చి ఇక్కడి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ఫిలిప్ స్ప్రాట్ మనవరాలు.
గతేడాదే రిలేషన్ కన్ఫర్మ్ చేసిన అమీర్
గతేడాది ముంబైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో అమీర్ ఖాన్ మొదటిసారిగా గౌరీ స్ప్రాట్‌ను అందరికీ పరిచయం చేశారు. తాము ఏడాదికి పైగా కలిసి ఉంటున్నామని, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నామని అప్పట్లో ప్రకటించారు. అయితే 60 ఏళ్ల వయసులో పెళ్లి తనకు సూట్ అవుతుందో లేదో చూడాలి అంటూ అప్పట్లో సరదాగా వ్యాఖ్యానించిన అమీర్, ఇప్పుడు ఎట్టకేలకు పెళ్లికే మొగ్గు చూపారు.
అమీర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం. ఆయనకు మొదటి భార్య రీనా దత్తాతో జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు, రెండో భార్య కిరణ్ రావుతో ఆజాద్ అనే కుమారుడు ఉన్నారు. కిరణ్ రావుతో అమీర్ 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ చివరిగా 'సితారే జమీన్ పర్' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం లాలా అమర్‌నాథ్ బయోపిక్‌తో పాటు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రాబోతున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆయన నటిస్తున్నారు.

