Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
7,000 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ సోకిందా?.. అసలు నిజం ఇదిగో

7,000 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ సోకిందా?.. అసలు నిజం ఇదిగో

ర్ణాటక రాష్ట్రంలో 7,000 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ సోకిందని, ప్రభుత్వమే కళాశాలల్లో హెచ్‌ఐవీ పరీక్షలను తప్పనిసరి చేసిందంటూ సోషల్ మీడియాలో, కొన్ని మాధ్యమాలలో విపరీతంగా ప్రచారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ (KSAPS) స్పష్టం చేసింది.

ఈ వార్తలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, వీటిని నమ్మవద్దని అధికారులు తేల్చిచెప్పారు.

కేఎస్‌ఏపీఎస్‌ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మ బసవనప్ప, ఐఏఎస్ మాట్లాడుతూ.. విద్యార్థులు, గృహిణులు లేదా కుటుంబ సభ్యుల వర్గాల వారీగా శాఖ ఎప్పుడూ హెచ్‌ఐవీ డేటాను నిర్వహించదని, కాబట్టి ప్రత్యేకంగా విద్యార్థుల్లో ఎంతమంది బాధితులు ఉన్నారనే కచ్చితమైన గణాంకాలు తమ వద్ద లేవని స్పష్టం చేశారు. విస్తృతంగా ప్రచారమవుతున్న 7,000 మంది అనే సంఖ్య పూర్తిగా నిరాధారమైనదని, 2004 నుంచి ఇప్పటివరకు 18-35 సంవత్సరాల వయస్సు గల కేటగిరీలో సుమారు 39,000 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నమోదయ్యారని తెలిపారు.

హెచ్‌ఐవీ, ఎయిడ్స్ (నివారణ మరియు నియంత్రణ) చట్టం-2017 ప్రకారం ఎవరికైనా పరీక్షలు చేయాలన్నా లేదా చికిత్స ప్రారంభించాలన్నా ముందస్తు అనుమతి (సమ్మతి) తప్పనిసరి అని, ఎక్కడా కూడా బలవంతపు పరీక్షలకు తావులేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. కేవలం స్వచ్ఛంద పరీక్షలను ప్రోత్సహించేందుకే కాలేజీలు, పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, పోలీసు, రవాణా, వైద్య విద్య రంగాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో సుమారు 56,000 మందికి తమకు హెచ్‌ఐవీ సోకిన విషయం తెలియదని అంచనా వేయగా, కేవలం 12 శాతం మంది మాత్రమే స్వచ్ఛందంగా టెస్టింగ్ కేంద్రాలకు వస్తున్నారని ఆమె తెలిపారు. ముందస్తు గుర్తింపు కోసం ఎలాంటి వ్యక్తిగత వివరాలు సేకరించకుండా 7 ప్రశ్నలతో రహస్య సెల్ఫ్-రిస్క్ అసెస్‌మెంట్‌ను అందించే 'బ్రేక్ ఫ్రీ' మొబైల్ యాప్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్ణాటకలో ప్రతి ఏటా సుమారు 11,000 నుంచి 12,000 కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని, ప్రజలు సురక్షిత లైంగిక పద్ధతులు పాటించాలని, అవసరమైనప్పుడు కౌన్సెలింగ్, టెస్టింగ్ చేసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 23,000 మంది కేఎస్‌ఏపీఎస్‌ ద్వారా ఉచిత చికిత్స పొందుతున్నారని, దాదాపు 96 శాతం మందిలో వైరల్ సప్రెషన్ సాధించి వ్యాప్తి ప్రమాగాన్ని గణనీయంగా తగ్గించామని తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాలు తల్లిదండ్రులు, ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారమైనా కేఎస్‌ఏపీఎస్‌ లేదా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) ద్వారా నిర్ధారించుకోవాలని కోరారు. తప్పుడు వార్తలను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu