పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి, వైఎస్సార్ హయాంలో నిర్మించిన కాలువలోకి వదిలి "పోలవరం నీళ్లు తెచ్చేశాం" అంటూ డప్పు కొట్టుకోవడం ప్రజలను మభ్యపెట్టడమేనని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా దుయ్యబట్టారు.
గ్రావిటీ ద్వారా పోలవరం రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్లు కావని తెలిసినా, చంద్రబాబు కేవలం ప్రచారం కోసమే ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఎడమ కాలువ ప్రధాన పనుల్లో 79 శాతం దివంగత వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని, తాను మొదలుపెట్టని ప్రాజెక్టులకు కూడా తానే కర్తనంటూ చంద్రబాబు క్రెడిట్ కొట్టేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన పనులే పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారాయని జగన్ ఆరోపించారు. స్పిల్‌వే పనులు పూర్తికాకుండా, నదీ ప్రవాహాన్ని మళ్లించకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించి, వరదల వల్ల అది కొట్టుకుపోయేలా చేశారని గుర్తుచేశారు. ఆ తప్పిదాలన్నింటినీ సరిదిద్ది తమ ఐదేళ్ల పాలనలో అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌లను క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు.
పోలవరం ఎత్తుపై కూడా చంద్రబాబును జగన్ నిలదీశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 45.72 మీటర్లు అయితే, దాన్ని 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్రాన్ని ఒప్పించడం వల్ల ప్రాజెక్ట్ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించారు. నిర్వాసితులకు పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.17,050 కోట్లతో సవరించి కీలక ప్యాకేజీలను ముందుకు తీసుకెళ్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాజెక్టును ఎందుకు గాలికొదిలేశారని ప్రశ్నించారు. డ్రామాలు, పబ్లిసిటీ ఈవెంట్లు పక్కనపెట్టి ప్రాజెక్టును పూర్తి స్థాయి ఎత్తు 45.72 మీటర్లతో పూర్తి చేయాలని, అప్పుడే గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువలకు పుష్కలంగా నీరందుతుందని వైఎస్ జగన్ హితవు పలికారు.

