తెలంగాణలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతన సిబ్బందికి ఆర్థిక శాఖ బుధవారం (నెల మొదటి తేదీనే) వేతనాలను విడుదల చేసింది.
గతంలో జీతాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం వల్ల ఈ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి, రెగ్యులర్ ఉద్యోగులతో పాటే వీరికి కూడా ఎలాంటి జాప్యం లేకుండా ఒకటో తేదీనే జీతాలు అందాలని ఇటీవల అధికారులను ఖచ్చితంగా ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ విభాగాలకు ముందస్తుగా కీలక సర్క్యులర్ జారీ చేసింది.
ఈ సర్క్యులర్ ప్రకారం.. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్, ఆథరైజేషన్ ప్రక్రియలో ఎక్కడా ఆలస్యం జరగకూడదని స్పష్టం చేసింది. అందుకోసం ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్ బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని, నెల చివరి పని దినానికల్లా వీటికి సంబంధించిన అన్ని రకాల ఆడిట్ ప్రక్రియలను పూర్తి చేయాలని గడువు విధించింది.
కాగా, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాల చెల్లింపుల ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగుల ఖాతాల్లో ఇప్పటికే జీతాలు విజయవంతంగా జమ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

