ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి.. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి.. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

News Meter తెలుగు

News Meter తెలుగు

1d

Loading...

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పార్లమెంటు ఉభయ సభలు 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026'ను ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి ఆమోదముద్ర వేశారు.

దీనితో అమరావతికి సంపూర్ణ చట్టబద్ధమైన, న్యాయపరమైన రక్షణ లభించింది. కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో ఉన్న "కొత్త రాజధాని" అనే సాధారణ పదాన్ని తొలగించి, దాని స్థానంలో "అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది" అని అధికారికంగా చేర్చారు.

ఈ చట్ట సవరణ జూన్ 2, 2024 నుండి రెట్రోస్పెక్టివ్ (ముందస్తు తేదీ నుండి అమలు) ప్రభావంతో అమల్లోకి వస్తుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న పదేళ్ల గడువు ముగిసిన తేదీ నుంచే అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ అనిశ్చితికి లేదా వివాదాలకు తావుండదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) చట్టం కింద నోటిఫై చేయబడిన ప్రాంతమే 'అమరావతి' అని ఈ సవరణ స్పష్టంగా నిర్వచించింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. అమరావతి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలిచిపోతుందని, ఈ చట్టపరమైన రక్షణల వల్ల భవిష్యత్తులో ఎవరూ దీనిని మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ గెజిట్ నోటిఫికేషన్‌తో పెట్టుబడిదారులలో విశ్వాసం పెరగడంతో పాటు, రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కానుంది. పదేళ్ల నిరీక్షణ తర్వాత రాష్ట్ర విభజన చట్టంలోని అస్పష్టత తొలగిపోయి, అమరావతికి శాశ్వత హోదా దక్కింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu

Comments

1
Loading comments...