ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుండి రూ.36 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 18 అర్బన్ ఫారెస్ట్‌లు, ఎకో-పార్కులు, కమ్యూనిటీ ఆధారిత ఎకో-టూరిజం ప్రాజెక్టులను ప్రారంభించారు.
వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ మధ్య ఈ అర్బన్ ఫారెస్ట్‌లు నగరాలు, పట్టణాలకు "గ్రీన్ లంగ్స్" (పచ్చని ఊపిరితిత్తులు) లాగా పనిచేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఫారెస్ట్ స్కీమ్ నిధులు, స్థానిక వనరులతో ఒక్కో ప్రాజెక్టును దాదాపు 50 హెక్టార్ల పరిధిలో, రూ.2 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా కోడూరు, కైలాసగిరి, మదనపల్లెల్లో ప్రత్యేక ఎర్రచందనం పరిరక్షణ పార్కులతో పాటు బయోడైవర్సిటీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నక్షత్ర వనాలు, రాశి వనాలను ఏర్పాటు చేశారు. పర్యాటకుల శారీరక, మానసిక ఉల్లాసం కోసం వీటిలో పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్ ట్రాక్‌లు, యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. నెల్లూరు రూరల్ పరిధిలోని అర్బన్ ఫారెస్ట్‌ను తాను సందర్శించానని, సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, గుట్టను ఈ పార్కుతో అనుసంధానించి ఆధ్యాత్మిక, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

