ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా, ఈ నెల 30న ఓటర్ల తుది జాబితాను అధికారికంగా విడుదల చేసేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అందిన దరఖాస్తులు మరియు అభ్యంతరాల పరిశీలన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అధికారులు ఈ నెల 25 నాటికి ఓటర్ల తుది జాబితాను పూర్తిగా ఖరారు చేయనున్నారు. ఖరారైన వివరాల ఆధారంగా ఈ నెల 26 నుంచి జాబితాల ముద్రణ (ప్రింటింగ్) పనులు ప్రారంభమవుతాయి. ముద్రించిన ఓటరు జాబితాల కాపీలను ఈ నెల 29న జిల్లా, నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారులకు చేరవేస్తారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రచురించనున్నారు. జాబితా విడుదలైన వెంటనే ఓటర్లు తమ పేర్లు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అధికారిక పోర్టల్ లేదా 'ఓటర్ హెల్ప్‌లైన్' యాప్ ద్వారా సరిచూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

