హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ సహచరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల భారత్ రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాను ఒక ఆప్తమిత్రుడిని, నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయానని కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజా జీవితాన్ని కొనసాగించిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తూ, వారి కుమార్తె స్వప్నకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
అలాగే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారని అందరం ఆశించామని, కానీ ఆయన ఇకలేరనే వార్త ఎంతో బాధిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని కేటీఆర్ అన్నారు. ఉద్యమ ఆశయాలను నమ్మి, జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా, సమగ్ర తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆయన చూపిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి భవిష్యత్తులోనూ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్పూర్తిదాయకంగా నిలుస్తాయని కేటీఆర్ తెలిపారు.

