పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్, అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు.
పానీహట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి తీర్థాంకర్ ఘోష్‌పై 28,836 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రత్నా దేవనాథ్‌కు 87,977 ఓట్లు లభించగా, ఆమె ప్రత్యర్థి తీర్థాంకర్ 59,141 ఓట్లకు పరిమితమయ్యారు. పోలైన ఓట్లలో ఆమె ఏకంగా 50 శాతానికి పైగా ఓట్లను కొల్లగొట్టడం విశేషం.
గత రెండు దశాబ్దాలుగా పానీహట్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ వస్తోంది. 2001 నుంచి 2021 వరకు జరిగిన వరుస ఎన్నికల్లో టీఎంసీ సీనియర్ నేత నిర్మల్ ఘోష్ ఇక్కడ అజేయంగా నిలిచారు. అటువంటి కంచుకోటను రత్నా దేవనాథ్ బద్దలు కొట్టడం బెంగాల్ రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. 2024 ఆగస్టులో ఆర్జీ కర్ ఆసుపత్రిలో తన కుమార్తెపై జరిగిన అమానవీయ ఘటనను, ఆ తర్వాత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆమె తన ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. "ఇది కేవలం ఒక ఎన్నికల పోరాటం కాదు, నా కుమార్తెకు న్యాయం కోరుతూ సాగిస్తున్న ధర్మపోరాటం. ఈ రోజు మా ఇంట్లో జరిగిన విషాదం రేపు మరొకరి ఇంట్లో జరగకూడదు" అంటూ ఆమె చేసిన భావోద్వేగ ప్రసంగాలు ఓటర్ల మనసు గెలుచుకున్నాయి.
ఆర్జీ కర్ ఘటన తర్వాత బెంగాల్ వ్యాప్తంగా వైద్యులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఆవేదనంతా ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంలో వ్యక్తమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా భద్రత, శాంతిభద్రతల అంశంపై రత్నా దేవనాథ్ చేసిన పోరాటం ఆమెను అసెంబ్లీకి చేర్చింది. తన కుమార్తె జ్ఞాపకార్థం సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యమని, మహిళల రక్షణ కోసం గళమెత్తుతానని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. నిన్నటి వరకు బాధితురాలి తల్లిగా కన్నీరు మున్నీరైన ఆమె, నేడు ప్రజల ప్రతినిధిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.

