విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అధికారికంగా ఆహ్వానం అందింది. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు హాజరుకావాల్సిందిగా ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు సీఎంను కోరారు.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఆలయ ప్రతినిధులు, ఆయనకు నవరాత్రుల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ముఖ్యమంత్రికి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం పలికారు.
అనంతరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఉత్సవాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి విషయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

