తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడకమార్గంలో ఓ వ్యక్తి పొగతాగడం వివాదానికి దారితీసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా పరిగణించింది.
నిబంధనలను ఉల్లంఘించిన సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా క్రమశిక్షణా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
అలిపిరి మెట్ల మార్గంలో ఓ వ్యక్తి ధూమపానం చేస్తున్న విషయం టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు ఇక్కడ మద్యపానం, ధూమపానం, మాంసాహారం, మత్తుపదార్థాల వినియోగంపై పూర్తి నిషేధం అమలులో ఉంది. ఈ నిబంధనలు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతో పాటు టీటీడీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. ఈ విషయం తెలిసినప్పటికీ, సదరు వ్యక్తి నిబంధనలను అతిక్రమించి పవిత్రమైన నడకమార్గంలో ధూమపానం చేయడం హేయమైన చర్య అని టీటీడీ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని టీటీడీ హెచ్చరించింది.

