బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది.
రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం చల్లబడి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలలో సముద్రం అల్లకల్లోలంగా మారనుండటంతో, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉండగా, ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక రాజధాని హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం లేదా రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

