తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగుచూసింది. తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ అదృశ్యమైన మూడు సంవత్సరాల మైనర్ బాలికపై ఓ వలస కార్మికుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు.
తీవ్ర గాయాలతో ముళ్లపొదల్లో పడి ఉన్న ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘాతుకానికి పాల్పడిన బిహార్‌కు చెందిన 19 ఏళ్ల వలస కార్మికుడు విబిన్ మంచ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కుటుంబం, నిందితుడు ఇద్దరూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న వలస కార్మికులే. బాలిక ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో నిందితుడు విబిన్ మంచ్.. బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి ఆ చిన్నారిని లోపలికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఓ పొరుగు మహిళ సదరు వ్యక్తి చిన్నారిని గదిలోకి తీసుకెళ్లడం చూసినప్పటికీ, ఇరు కుటుంబాలు తెలిసిన వలస కార్మికులే కావడంతో ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు.
సాయంత్రం 6 గంటలైనా చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి చుట్టుపక్కల వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలో బహిర్భూమికి వెళ్లిన కొందరు స్థానికులు సమీపంలోని ఒక ముళ్లపొదలో చిన్నారి స్పృహ తప్పి, అత్యంత క్లిష్ట పరిస్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. వారు వెంటనే బాలికకు నీళ్లు తాగించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్ర రక్తస్రావం, గాయాలతో ఉన్న చిన్నారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘాతుకంపై కేసు నమోదు చేసిన పోలీసులు 19 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.

