Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతిలో ఇంటర్నేషనల్ స్కూల్..సీఆర్‌డీఏతో GIIS కీలక ఒప్పందం

అమరావతిలో ఇంటర్నేషనల్ స్కూల్..సీఆర్‌డీఏతో GIIS కీలక ఒప్పందం

వ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ విద్యా హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (GIIS) ఏర్పాటు కానుంది.

ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం శాఖమూరులో 4 ఎకరాల విలువైన భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) మరియు GIIS ప్రతినిధులు అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ అంతర్జాతీయ క్యాంపస్‌లో విద్యార్థుల కోసం అత్యాధునిక సౌకర్యాలను కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు, అత్యాధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్‌లు, నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) కేంద్రాలను ఇక్కడ నిర్మించనున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ స్థాయి ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా వసతులు, విశాలమైన ప్లే గ్రౌండ్స్ ఈ క్యాంపస్ ప్రత్యేకతలుగా నిలవనున్నాయి.

రాజధాని ప్రాంతంలో ఐటీ, పరిశ్రమలు, ప్రభుత్వ రంగాలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ స్కూల్ ఏర్పాటు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ నివసించే ఐటీ నిపుణులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తల పిల్లలకు గ్లోబల్ స్థాయి పాఠశాల విద్య స్థానికంగానే అందుబాటులోకి రానుంది. ఈ అంతర్జాతీయ స్కూల్ రాకతో అమరావతి పరిధిలో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊపు రావడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు రాజధాని వైపు అడుగులు వేసేందుకు మార్గం సుగమం కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu