సాంకేతికత ఎంతగా విస్తరించినా, తల్లిదండ్రుల ప్రేమకు సరిహద్దులు అడ్డంకి కావని నిరూపించే ఓ ఆసక్తికర సంఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. వేల మైళ్ల దూరంలో ఉన్న కూతురి వివాహాన్ని తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో వీక్షించి, వర్చువల్‌గానే ఆశీర్వదించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె హిమబిందు అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అక్కడ ఆమెకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్‌తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో అమెరికాలో శుక్రవారం రాత్రి వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల అక్కడికి వెళ్లలేకపోయిన హిమబిందు తల్లిదండ్రులు.. స్వగ్రామంలోనే ఉంటూ డిజిటల్ తెరపై ఆన్‌లైన్ ద్వారా పెళ్లి తంతును వీక్షించారు. స్క్రీన్ ముందే నిలబడి నవదంపతులపై అక్షింతలు చల్లి మనసారా ఆశీర్వదించారు. అనంతరం తమ గ్రామంలో బంధువులు, మిత్రుల కోసం ఘనంగా పెళ్లి విందును ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ పెళ్లి వేడుక స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది.

