డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియను ఉన్నత విద్యాశాఖ ప్రారంభించింది. బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఎం తదితర అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఈ మేరకు విద్యార్థులు నిర్దేశిత తేదీల్లో ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 5 నుంచి 11వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అనంతరం ఆగస్టు 5 నుంచి 20 వరకు హెల్ప్‌డెస్క్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థుల సర్టిఫికెట్ల ధృవీకరణను ఆగస్టు 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. వెబ్ ఆప్షన్ల నమోదుకు ఆగస్టు 15 నుంచి 19 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే నమోదు చేసిన వెబ్ ఆప్షన్లలో మార్పులు చేయాలనుకునే విద్యార్థులు ఆగస్టు 20న సవరణలు చేసుకోవచ్చు.
విద్యార్థులు నమోదు చేసిన ప్రాధాన్యతల ఆధారంగా ఆగస్టు 26న సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 27 నుంచి 29 మధ్య సంబంధిత కళాశాలల్లో చేరి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 27 నుంచే డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు అన్ని గడువులను గమనించి, రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, కళాశాల రిపోర్టింగ్ వంటి ప్రక్రియలను నిర్ణీత తేదీల్లో పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

