జులై 31 నాటికి దేశవ్యాప్తంగా 5.9 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలయ్యాయి. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించింది.
గత మదింపు సంవత్సరం (2025-26)లో ఐటీఆర్ గడువును పొడిగించిన కారణంగా, సెప్టెంబర్ 16 నాటికి 7.3 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయి.
ఎలాంటి అదనపు (లేట్) ఫీజు లేకుండా ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేయడానికి జులై 31ని చివరి తేదీగా నిర్ణయించారు. మీ వార్షిక ఆదాయం రూ. 50 లక్షల లోపు ఉండి, గరిష్టంగా రెండు సొంతిళ్ల ద్వారా ఆదాయం, అలాగే రూ. 5,000 లోపు వ్యవసాయ ఆదాయం ఉన్నవారు ఈ ఫారంను ఎంచుకోవాలి. వార్షిక ఆదాయం రూ. 50 లక్షల లోపు ఉన్నప్పటికీ.. రెండు కంటే ఎక్కువ సొంతిళ్ల ద్వారా ఆదాయం వస్తున్నవారు, షేర్లు/మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల ద్వారా స్వల్పకాలిక మూలధన లాభాలు పొందినవారు, విదేశీ ప్రయాణాలకు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేసిన వారు ఈ ఫారం ద్వారా రిటర్నులు దాఖలు చేయాలి. జులై 31 నాటికి ఐటీఆర్ ఫైల్ చేయలేకపోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గడువు ముగిసిన తర్వాత కూడా జరిమానాతో రిటర్నులు దాఖలు చేయడానికి ఐటీ శాఖ డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పిస్తోంది.

