కాంగో దేశం నుంచి భారత్‌లోని ఆగ్రాకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ సోకినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. దీంతో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను ఆరోగ్య శాఖ హై అలర్ట్ చేసింది.
ఈ వైరస్ ఇతరులకు సోకకుండా నిరోధించేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఆ ఇద్దరు బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులందరినీ హోమ్ ఐసోలేషన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహించిన సమయంలో వీరి నమూనాలో వైరస్ ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం బాధితుల్లో కేవలం సాధారణ లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆగ్రా ఇన్ఛార్జ్ సీఎంఓ డాక్టర్ అమిత్ రావత్ వెల్లడించారు. అయినప్పటికీ వైద్య బృందాలు వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అదనపు నమూనాలను సేకరిస్తున్నాయి.
వైద్య నిపుణుల వెల్లడించిన వివరాల ప్రకారం, ఎబోలా సోకిన ప్రాథమిక దశలో తీవ్రమైన జ్వరం, చలి, తీవ్ర బలహీనత, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ ముదిరే కొద్దీ వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లు రావడం జరుగుతుంది. తీవ్రమైన కేసుల్లో కిడ్నీ, కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా చిగుళ్లు, ముక్కు, కళ్లు, ఇంజెక్షన్ చేసిన ప్రదేశాల నుంచి రక్తస్రావం కావడం, గందరగోళం, తీవ్రమైన అశాంతి వంటి నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఆఫ్రికాలోని కాంగోలో ప్రస్తుతం అరుదైన 'బుండిబుగ్యో' రకం ఎబోలా వైరస్ విజృంభిస్తుండటంతో, డబ్ల్యూహెచ్‌వో దీన్ని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
ఈ వైరస్ కోవిడ్-19 లాగా గాలి లేదా శ్వాస ద్వారా వ్యాపించదని వైద్యులు స్పష్టం చేశారు. ఎబోలా సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట, మూత్రం, మలం, వాంతులు వంటి శరీర ద్రవాలు ఇతరుల గాయాలకు తగిలితే ఈ వ్యాధి సోకుతుంది. అలాగే కన్ను, ముక్కు, నోటి పొరల ద్వారా కూడా ఇది ప్రవేశిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి వాడిన సూదులు, దుస్తులు, మంచాలను తాకడం వల్ల లేదా ఇన్ఫెక్షన్ ఉన్న అడవి జంతువులు, గబ్బిలాలను తాకడం, వాటి మాంసం తినడం ద్వారా ముప్పు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ బాధితులకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది.

