Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌తో సహా 60 దేశాలపై కొత్త టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

భారత్‌తో సహా 60 దేశాలపై కొత్త టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా టారిఫ్ నిర్ణయం మరోసారి న్యాయస్థానానికి చేరింది. భారత్‌తో సహా 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల దిగుమతులపై విధించిన కొత్త సుంకాలకు వ్యతిరేకంగా 25 డెమొక్రాటిక్ రాష్ట్రాల కూటమి సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఇలాంటి చర్యలపై గతంలో వరుస కోర్టు తీర్పులు ఎదురైనప్పటికీ, ట్రంప్ యంత్రాంగం తన చట్టబద్ధమైన అధికారాలను అతిక్రమిస్తోందని ఈ రాష్ట్రాలు తమ వ్యాజ్యంలో వాదించాయి. న్యూయార్క్‌లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో ఈ పిటిషన్ దాఖలైంది. 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద గత నెల అమల్లోకి వచ్చిన 10 నుండి 12.5 శాతం టారిఫ్‌లను ఈ వ్యాజ్యం టార్గెట్ చేసింది.

బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల ఎగుమతులను అడ్డుకోవడంలో విఫలమైన దేశాలపైనే ఈ సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ యంత్రాగం చెబుతోంది. అయితే, కోర్టుల ద్వారా ఇప్పటికే కొట్టివేయబడిన టారిఫ్‌లను మళ్లీ అమలు చేసేందుకే ప్రభుత్వం 'బలవంతపు శ్రమ'ను ఒక సాకుగా ఉపయోగిస్తోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఈ వివాదాస్పద టారిఫ్‌లు జూలై 24న ప్రకటించబడ్డాయి. యూరోపియన్ యూనియన్, భారతదేశంతో సహా 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల దిగుమతులపై ఇవి వర్తిస్తాయి. అయితే, బలోపేతమైన నిబంధనలు అమలు చేసిన కొన్ని దేశాలకు తక్కువ టారిఫ్ రేట్లు వర్తింపజేశారు. భారత్‌పై విధించాల్సిన సుంకాన్ని 12.5 శాతం నుండి 10 శాతానికి తగ్గించినట్లు సీనియర్ అధికార వర్గాలు తెలిపాయి.

మరోవైపు చమురు, సహజ వాయువులు, ఎరువులు వంటి కొన్ని ప్రత్యేక వస్తువులకు ఈ కొత్త టారిఫ్‌ల నుంచి మినహాయింపు లభించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, అమెరికన్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి టారిఫ్‌లే ప్రధాన అస్త్రమని ట్రంప్ గట్టిగా విశ్వసిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు, ఇంటర్నేషనల్ ట్రేడ్ కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తగలడంతో, ట్రంప్ యంత్రాగం ఇప్పుడు ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301ని కొత్త వ్యూహంగా ఎంచుకుంది. విదేశీ ప్రభుత్వాల అన్యాయమైన వాణిజ్య విధానాలను ఎదుర్కొనేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఏదేమైనా, ఈ తాజా న్యాయపోరాటం అమెరికాలో మరోమారు వాణిజ్య వేడిని రాజేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu