తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలల వరకు అన్ని విద్యాసంస్థలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండవచ్చని భావించి ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని జగిత్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
సెలవు కారణంగా విద్యార్థుల బోధనకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రకటించిన సెలవుకు బదులుగా ఆగస్టు 8న (రెండో శనివారం) పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ వెల్లడించింది. ఆ రోజు సాధారణ తరగతులు నిర్వహించి సిలబస్‌ను పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. వర్షాల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖతో పాటు ప్రభుత్వ విభాగాలు జారీ చేసే సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

