రైలు ప్రయాణంలో భార్య కళ్లేదుటే భర్త, అతడి ప్రియురాలు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఛప్రా గ్రామానికి చెందిన శిరీశ్‌కుమార్(34) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్.
అతనికి సులోచన అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన ఒక వివాహిత(34)తో శిరీశ్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. సదరు వివాహిత భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో, ఆమె తన పిల్లలను తీసుకుని హైదరాబాద్‌లోని మూసాపేటలో ఉంటున్న తన సోదరి ఇంటికి వచ్చేసింది. ఈ క్రమంలో శిరీశ్‌కుమార్ తరచూ ఆమెను కలవడానికి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేవాడు. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
నెల రోజుల క్రితం శిరీశ్‌కుమార్, అతని ప్రియురాలు ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా మాయమయ్యారు. దీనిపై విచారించిన భార్య సులోచన.. తన భర్త ప్రియురాలితో కలిసి వెళ్లిపోయినట్లు నిర్ధారించుకుంది. వారు తమిళనాడులోని కోయంబత్తూరులో కలిసి నివాసముంటున్నట్లు తెలుసుకుని, తన బంధువులతో కలిసి అక్కడికి వెళ్లి వారిద్దరినీ పట్టుకుంది. అనంతరం వారందరినీ తీసుకుని సోమవారం మధ్యాహ్నం కోయంబత్తూరులో శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి హైదరాబాద్‌కు తిరుగుపయనమైంది.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో రైలు హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో శిరీశ్‌కుమార్, అతని ప్రియురాలు ఇద్దరూ కలిసి బాత్‌రూమ్‌కు వెళ్లారు. ముందే తెచ్చుకున్న గడ్డి మందు (పురుగుల మందు) ద్రావణాన్ని ఇద్దరూ తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారు ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సులోచన తోటి ప్రయాణికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా, ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఆమె సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. రైలు స్టేషన్‌కు చేరుకోగానే పోలీసులు వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

