Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బోనాల ఎఫెక్ట్: సికింద్రాబాద్‌లో ఆ రోడ్లు పూర్తి బంద్..ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

బోనాల ఎఫెక్ట్: సికింద్రాబాద్‌లో ఆ రోడ్లు పూర్తి బంద్..ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు మరియు మళ్లింపులు విధించారు.

ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీన జాతర పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆలయ పరిసరాల్లో దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో సాధారణ వాహనాల రాకపోకలపై నియంత్రణ ఉంటుందని, భక్తుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

జాతర సందర్భంగా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులైన పొగాకు బజార్, హమాలీ విగ్రహం దారి, బాటా క్రాస్ రోడ్స్ నుంచి రోచా బజార్ వరకు ఉన్న సుభాష్ రోడ్, అడవియ్య క్రాస్ రోడ్స్ నుంచి హిల్ స్ట్రీట్ మార్గం మరియు జనరల్ బజార్ రహదారులను సాధారణ వాహనాల కోసం పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ క్రమంలో కర్బాలా మైదాన్, రాణిగంజ్, ప్యారడైజ్, సీటీఓ, బాటా, సంగీత్, బైబిల్ హౌస్, ప్యాట్నీ, రసూల్‌పురా తదితర 17 కీలక కూడళ్ల వద్ద తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

పరిస్థితికి అనుగుణంగా ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ప్యాట్నీ క్రాస్ రోడ్స్, ఎస్‌బీఐ, ప్యారడైజ్ వైపు నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను మినిస్టర్ రోడ్ లేదా క్లాక్ టవర్, సంగీత్, ముషీరాబాద్, కవడిగూడ మీదుగా మళ్లిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు మరియు సాధారణ వాహనాలు రాణిగంజ్, మినిస్టర్ రోడ్, పి.ఎన్.టి ఫ్లైఓవర్, సీటీఓ, సంగీత్ మీదుగా గోపాలపురం లైన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే బస్సులు గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, కవడిగూడ మార్గంలో ప్రయాణించాలి.

బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం పోలీసులు విస్తృత పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే భక్తులు హరిహర కళాభవనం, యశోద పార్కింగ్, మహబూబ్ కాలేజ్, సీఎమ్‌ఆర్ షాపింగ్ మాల్, తాజ్ త్రిస్టార్ లైన్‌లలో తమ వాహనాలను నిలుపుకోవచ్చు. రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చేవారు ఓల్డ్ జైలు ఖానా స్థలంలోనూ, పంజాగుట్ట, బేగంపేట్ వైపు నుంచి వచ్చే భక్తులు నల్లగుట్ట జీహెచ్‌ఎమ్‌సీ గ్రౌండ్స్, వెస్లీ కాలేజ్, జింఖానా గ్రౌండ్స్, స్వప్నలోక్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ చేసుకోవచ్చు. ఘాస్‌మండి, రాణిగంజ్ భక్తులకు ఇస్లామియా హైస్కూల్, అడవియ్య మెమోరియల్ హైస్కూల్‌లలో చోటు కేటాయించగా, VIP వాహనాలకు ఎం.జి. రోడ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించారు. ప్రయాణంలో అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu