ఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను తుడిచిపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం మరొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 1౩5 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన 'బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్, 1891' స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 'బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు, 2026' (Bankers' Books Evidence Bill, 2026) లోక్‌సభలో పరిశీలన, ఆమోదం పొందేందుకు సిద్ధమైంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఈ బిల్లును దిగువ సభలో ప్రవేశపెట్టగా, నేడు ఆమోదం కోసం అజెండాలో చేర్చారు. 1891 నాటి భౌతిక పేపర్ లెడ్జర్ల స్థానంలో, ప్రస్తుత ఆధునిక డిజిటల్ వ్యవస్థకు అనుగుణంగా చట్టపరమైన నిబంధనలను సవరించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
ఈ నూతన చట్టం అమలులోకి వస్తే డిజిటల్ యుగానికి తగినట్లుగా బ్యాంకింగ్ రికార్డులకు సమగ్ర చట్టబద్ధత లభిస్తుంది. ప్రస్తుతం డిజిటల్, ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచే బ్యాంకింగ్ లావాదేవీల రికార్డులు, ఇతర ఆధునిక ప్రాసెస్ ఆధారిత డేటాను కోర్టుల్లో చట్టబద్ధమైన సాక్ష్యాలుగా ప్రవేశపెట్టేందుకు ఇది స్పష్టమైన దారి చూపిస్తుంది. ఫలితంగా డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలకు చట్టపరమైన రక్షణ మరింత బలోపేతం కానుంది.
మరోవైపు, ప్రతి న్యాయపరమైన కేసులోనూ బ్యాంకుల ఒరిజినల్ పుస్తకాలు లేదా భౌతిక రికార్డులను ప్రత్యక్షంగా కోర్టుకు తీసుకురావాల్సిన అవసరం తప్పుతుంది. అంతేకాకుండా, రికార్డుల సమర్పణ నిమిత్తం బ్యాంకు అధికారులు పదేపదే న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన భారం కూడా గణనీయంగా తగ్గుతుంది. బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన కోర్టు విచారణలు మరింత వేగంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తయ్యేందుకు ఈ చట్టపరమైన సంస్కరణలు దోహదపడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

