Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైల్డ్‌ పోర్నోగ్రఫీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

చైల్డ్‌ పోర్నోగ్రఫీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

బాలల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన అశ్లీల కంటెంట్ ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై అభియోగాల నమోదును ఢిల్లీ కోర్టు సమర్థించింది.

నేరానికి ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న మొబైల్ ఫోన్ స్వాధీనం కాలేదనే కారణంతో విచారణను ప్రారంభ దశలోనే నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది.

సాకేత్ కోర్టుకు చెందిన అదనపు సెషన్స్ జడ్జి హర్‌గుర్వరీందర్ సింగ్ జగ్గీ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ట్రయల్ కోర్టు ఐటీ చట్టంలోని సెక్షన్ 67బీ కింద అభియోగాలు నమోదు చేయాలని ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నిందితుడు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ సెక్షన్ ప్రకారం ఎలక్ట్రానిక్ రూపంలో బాలల లైంగిక దుర్వినియోగ కంటెంట్‌ను ప్రచురించడం, ప్రసారం చేయడం లేదా పంపిణీ చేయడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది.

కేసు ఎలా వెలుగులోకి వచ్చింది?

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ద్వారా ఢిల్లీ సైబర్ పోలీసులకు అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (NCMEC) రూపొందించిన సైబర్‌టిప్‌లైన్ నివేదిక అందింది. అందులో ఓ ఫేస్‌బుక్ ఖాతా నుంచి 17 సెకన్ల నిడివి ఉన్న బాలల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన వీడియో అప్‌లోడ్ చేసినట్లు పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు సంబంధిత ఫేస్‌బుక్ ఖాతాకు అనుసంధానమైన ఐపీ అడ్రస్, మొబైల్ నంబర్‌ను గుర్తించారు. ఆ మొబైల్ నంబర్ నమోదైన వ్యక్తి, నిందితుడే తన ఫోన్ ద్వారా ఆ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించి నిర్వహించాడని పోలీసులకు తెలిపినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు.

నిందితుడి వాదనలు

ఈ కేసులో ప్రధాన ఆధారం NCMEC రూపొందించిన సైబర్‌టిప్‌లైన్ నివేదిక మాత్రమేనని, ఫేస్‌బుక్ లేదా NCMEC అధికారులను దర్యాప్తులో విచారించలేదని నిందితుడు వాదించాడు. అలాగే తన వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం కాలేదని, తన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకోవడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని పేర్కొన్నాడు. వీడియో కూడా ఐటీ చట్టం సెక్షన్ 67బీ పరిధిలోకి రాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.

కోర్టు ఏం చెప్పింది?

నిందితుడి వాదనలను తిరస్కరించిన కోర్టు, అభియోగాల నమోదుదశలో నేరం నిరూపించాల్సిన అవసరం లేదని, అందుబాటులో ఉన్న ఆధారాలు నిందితుడిపై 'బలమైన అనుమానం' కలిగిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఆధారాల ఆమోదయోగ్యత, వాటి విలువ వంటి అంశాలను విచారణ సందర్భంగా పరిశీలిస్తామని పేర్కొంది.

మొబైల్ ఫోన్ లభించకపోవడం ఒక్కటే కేసును బలహీనపరచదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. 'Just Rights for Children Alliance vs S. Harish (2024)' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా ఖాతాపై నిందితుడికి నియంత్రణ ఉన్నట్లు ఐపీ లాగ్‌లు, సబ్‌స్క్రైబర్ వివరాలు వంటి డిజిటల్ ఆధారాలు చూపిస్తే, పరికరం స్వాధీనం కావడం తప్పనిసరి కాదని పేర్కొంది. అలాగే నిందితుడు మొబైల్‌ను పారవేశాడనే ఆరోపణ ఉన్న నేపథ్యంలో, అదే కారణాన్ని చూపించి చట్టబద్ధమైన విచారణను ప్రారంభ దశలోనే అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

విచారణ కొనసాగించాలని ఆదేశం

వీడియోను ట్రయల్ కోర్టు ఇప్పటికే పరిశీలించి, ప్రాథమికంగా అది బాలలతో కూడిన లైంగిక దుర్వినియోగ కంటెంట్‌గా గుర్తించినట్లు సెషన్స్ కోర్టు తెలిపింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి వయసు లేదా లింగానికి సంబంధించిన అభ్యంతరాలు విచారణలో తేలాల్సిన అంశాలని పేర్కొంది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి చట్టవిరుద్ధత లేదని తేల్చిన సెషన్స్ కోర్టు, నిందితుడిపై నమోదైన అభియోగాలను సమర్థిస్తూ కేసు విచారణను చట్ట ప్రకారం కొనసాగించాలని ఆదేశించింది. అలాగే ఈ దశలో చేసిన వ్యాఖ్యలు తుది విచారణ ఫలితాన్ని ప్రభావితం చేయవని కూడా స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu