షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మిట్ సమయంలో పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. ఈ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన SCO దేశాల అధినేతల గ్రూప్ ఫోటోను పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సోషల్ మీడియాలో పంచుకుంది.
అయితే అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కనిపించకుండా కత్తిరించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సరిగ్గా మధ్యలో ఉండేలా ఆ ఫోటోను మార్చింది. దీనికి బదులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలైన, పూర్తి స్థాయి గ్రూప్ ఫోటోను పంచుకున్నారు. భారత్ షేర్ చేసిన ఈ పూర్తి ఫోటోలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా ఇతర దేశాల నేతలందరూ ఉన్నారు.
కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశంలో సభ్య దేశాల నేతలందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. అయితే, ఈ ఫోటోను పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకునే క్రమంలో, అందులో ఉన్న భారత ప్రధాని మోదీని కత్తిరించి పక్కనపెట్టింది. భారత్ మాత్రం ఈ విషయంలో ఎంతో హుందాగా వ్యవహరించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా నేతలందరూ ఉన్న పూర్తి ఫోటోను అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు ఫోటోలను పోలుస్తూ నెటిజన్లు పాకిస్థాన్ తీరుపై మండిపడుతున్నారు.

