Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా సాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ సేకరణ జరుగుతోందని చెప్పారు.

ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని పేర్కొన్న ఆయన, ఈ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో కనీస మద్దతు ధరకే (MSP) అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 16,000 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఈ సీజన్లో 143 లక్షల టన్నుల ధాన్యం పండగా, ఇప్పటివరకు 73 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా సేకరించింది. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని, చివరి గింజ వరకు మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం 73 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, కేంద్రం మాత్రం కేవలం 5 లక్షల టన్నులు మాత్రమే కొంటామని చెబుతోందని విమర్శించారు. ఏటా తెలంగాణ నుంచి ధాన్యం కోటాను కేంద్రం తగ్గిస్తోందని, కోటా పెంచాలని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి కోరినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ధర్నాలు చేయడం పక్కనబెట్టి, ఢిల్లీకి వెళ్లి వడ్లు కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

ధాన్యం సేకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,000 మిల్లులు పనిచేస్తున్నాయని, రవాణా కోసం 13,000 వాహనాలను సిద్ధంగా ఉంచామని మంత్రి వివరించారు. హమాలీల కొరత ఉన్నప్పటికీ కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి రూ. 15,000 కోట్లు ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ. 49,000 కోట్లు ఇస్తోందని గుర్తుచేశారు. తెలంగాణలో ఇప్పటికే 60 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయగా, పొరుగు రాష్ట్రమైన ఏపీలో 24 లక్షల టన్నులు మాత్రమే కొన్నారని పోల్చి చెప్పారు.

ఇప్పటివరకు రూ. 11,050 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా వేశామని, గత రెండున్నరేళ్లలో రూ. 36,000 కోట్లు జమ చేశామని మంత్రి తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన 10,214 టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను నష్టపోకుండా ఆదుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu