న్యూఢిల్లీలోని హౌజ్‌ఖాస్ పరిధిలో ఉన్న తన నివాసంలో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) మొదటి చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ (80) మరణించారు.
ఏసీ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన కుమారుడు ప్రస్తుతం ఎయిమ్స్ (AIIMS) ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.
బుధవారం రాత్రి 11:24 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అర్ధరాత్రి 12:20 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే దట్టమైన పొగను పీల్చడం వల్ల ధనేంద్ర కుమార్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి అనుమానాస్పద కోణం కనిపించలేదని, షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపంపై విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
1968 బ్యాచ్ హర్యానా క్యాడర్‌కు చెందిన ధనేంద్ర కుమార్.. తన సుదీర్ఘ కెరీర్‌లో వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, హర్యానా ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా, HSIDC చైర్మన్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

