బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ రేట్ల విషయంలో పారదర్శకత, సమానత్వాన్ని తీసుకురావడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే రోజున ఒకే మొత్తంలో డిపాజిట్ చేసే ఖాతాదారులకు బ్యాంకు ఏ బ్రాంచ్‌లోనైనా ఒకే వడ్డీ రేటు వర్తించాలని స్పష్టం చేసింది.
ఒకే రకమైన డిపాజిట్లకు వేర్వేరు బ్రాంచీల్లో భిన్నమైన వడ్డీ రేట్లు ఇవ్వడానికి అవకాశం ఉండదని ఆదేశాల్లో పేర్కొంది. ఆర్‌బీఐ విడుదల చేసిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంక్స్ - ఇంటరెస్ట్ రేట్ ఆన్ డిపాజిట్స్) సెకండ్ అమెండ్‌మెంట్ డైరెక్షన్స్, 2026' ప్రకారం, డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను బ్యాంకులు ముందుగానే తమ అధికారిక వెబ్‌సైట్లలో ప్రకటించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూల్‌కు అనుగుణంగానే వడ్డీ రేట్లు అమలు చేయాలని ఆదేశించింది.
ముఖ్యంగా బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రతి పని దినం ఉదయం 10 గంటలకు బ్యాంకుల వెబ్‌సైట్లలో ప్రకటించాలని, అత్యధికంగా 10:10 గంటలలోపు ఈ వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్‌బీఐ సూచించింది. దీంతో ఖాతాదారులు అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లను సులభంగా తెలుసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే, లిక్విడిటీ కవరేజ్ రేషియో నిబంధనల ప్రకారం వర్తించే రన్-ఆఫ్ రేట్లు లేదా అసురక్షిత హోల్‌సేల్ ఫండింగ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బల్క్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లు నిర్ణయించే స్వేచ్ఛను బ్యాంకులకు ఆర్‌బీఐ కల్పించింది. అయితే ఆ రేట్లు కూడా ముందుగానే బహిరంగంగా ప్రకటించాల్సి ఉంటుంది.
ఈ కొత్త మార్గదర్శకాలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. జూన్‌లో విడుదల చేసిన ముసాయిదా నిబంధనలపై బ్యాంకులు, ఇతర భాగస్వాముల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం ఈ తుది మార్గదర్శకాలను జారీ చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. కొత్త నిబంధనలతో బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరగడంతో పాటు, ఖాతాదారులందరికీ సమానంగా వడ్డీ రేట్లు వర్తించేలా చర్యలు బలోపేతం కానున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకు బ్రాంచీ ఆధారంగా కాకుండా, ఒకే తరహా డిపాజిట్లకు ఒకే విధమైన వడ్డీ లభించడం వల్ల వినియోగదారుల విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

