Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిసెంబర్‌లో 'తెలంగాణ రైజింగ్-2026' గ్లోబల్ సమ్మిట్: అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు!

డిసెంబర్‌లో 'తెలంగాణ రైజింగ్-2026' గ్లోబల్ సమ్మిట్: అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు!

హైదరాబాద్: రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ నెలలో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్-2026' గ్లోబల్ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జజూ అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర జీఎస్‌డీపీ (GSDP)ని గణనీయంగా పెంచేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ ఒక కీలకమైన వేదికగా ఉపయోగపడుతుందని, దీనికోసం అంతర్జాతీయ, జాతీయ సంస్థల సహకారంతో అన్ని ప్రభుత్వ రంగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన మరియు సంక్షేమం వంటి అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకే 'తెలంగాణ రైజింగ్' కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎస్ పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్మాణాలు జరుపుకుంటున్న 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' కాంప్లెక్స్‌ను ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు వినియోగించుకోవాలని సూచించారు. సమ్మిట్ నాటికి రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu