Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డోలి మోతలకు శాశ్వత స్వస్తి.. 'సంజీవని' వైద్య ఆరోగ్య ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం

డోలి మోతలకు శాశ్వత స్వస్తి.. 'సంజీవని' వైద్య ఆరోగ్య ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు నియోజకవర్గంలోని గన్నెల గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'సంజీవని' హెల్త్‌కేర్ ప్రాజెక్టును శనివారం ఘనంగా ప్రారంభించారు.

మారుమూల, దుర్గమ ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు ఇంటివద్దకే వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. కొండ ప్రాంతాలలో గర్భిణులు, రోగులను డోలిలో మోసుకెళ్లే దుస్థితికి ఈ ప్రాజెక్టు ద్వారా శాశ్వత చెక్ పడనుంది. టెక్నాలజీ ఆధారిత వైద్య సేవలు, మొబైల్ మెడికల్ యూనిట్లు, డ్రోన్ల ద్వారా రక్త నమూనాల రవాణా వంటి ఆధునిక సౌకర్యాలను గిరిజన ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చారు.

ఈ ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, మారుమూల గ్రామాల నుంచి పాడేరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలను తరలించే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మార్చే 'గేమ్ ఛేంజర్' సంజీవని అని ఆయన అభివర్ణించారు. ఇప్పటికే గర్భిణుల కోసం 'తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్' వాహనాలను ప్రవేశపెట్టామని, తాజా సంజీవనితో డోలి మోతల బాధలు పూర్తిగా తొలగిపోతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గిరిజనుల ఇంటివద్దకే వైద్య సంప్రదింపులు, డయాగ్నోస్టిక్ సేవలను అందించే 104 'ఆరోగ్య రథాలను' సీఎం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన లబ్ధిదారులు తమ అనుభవాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. గర్భిణి దివ్య మాట్లాడుతూ.. సంజీవని మొబైల్ సేవలు ద్వారా తనకు క్రమం తప్పకుండా ఆరోగ్య సలహాలు, పోషకాహార సూచనలు అందుతున్నాయని తెలిపారు. మరోవైపు 'తల్లికి వందనం' పథకం ద్వారా నలుగురు పిల్లలకు ఆర్థిక సాయం అందిందని గుంట నాగమ్మ చెప్పగా, ప్రభుత్వ పాఠశాలలో చదివి నీట్ (NEET) సాధించినట్లు అండిమట్టి సన్యాసమ్మ తెలిపారు. విద్యార్థుల ప్రతిభను చూసి అభినందించిన సీఎం.. గిరిజన విద్యార్థుల కోసం 6 నుంచి 12వ తరగతి వరకు ఇంటిగ్రేటెడ్ విద్యా కేంద్రాలతో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు.

అంతేకాకుండా గిరిజన రైతులు కాఫీ, మిరియాల సాగును మరింత పెంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలోని సహజ వనరులు, పరిశుభ్రమైన వాతావరణం గిరిజన యువతకు పారిశ్రామికంగా, ఉపాధి పరంగా గొప్ప అవకాశాలను అందిస్తాయని భరోసానిచ్చారు. మారుమూల కొండ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే ఈ డోర్ స్టెప్ హెల్త్‌కేర్ సేవలను గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu